మహానటి దర్శకుడిపై జెమినీ గణేశన్ కూతురు ఆగ్రహం

జెమినీ గణేశన్ పాత్ర చిత్రీకరించిన తీరుపై అభ్యంతరాలు

Last Updated : May 18, 2018, 09:51 AM IST
మహానటి దర్శకుడిపై జెమినీ గణేశన్ కూతురు ఆగ్రహం

మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమా ఆడియెన్స్ నుంచే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. సావిత్రి సినిమాను ఇంతకన్నా బాగా ఇంకెవ్వరూ తెరకెక్కించలేరు. సావిత్రమ్మే మళ్లీ లేచొచ్చిందా అన్నంత గొప్పగా, ఎక్కడా ఎటువంటి లోపం లేకుండా సినిమాను రూపొందించారు అని విమర్శకులు దర్శకుడు నాగ్ అశ్విన్‌పై ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇదిలావుంటే, ఓవైపు ప్రపంచం అంతా మహానటి సినిమాను, ఆ సినిమాకు పనిచేసిన యూనిట్‌ని అభినందిస్తోంటే, జెమినీ గణేశన్ కూతురు, చెన్నైలో ప్రముఖ వైద్యురాలు అయిన కమలా సెల్వరాజ్ మాత్రం మహానటి యూనిట్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. తమిళంలో నడిగైయార్‌ తిలగం పేరిట రిలీజైన ఈ సినిమాను చూసిన ఆమె.. సినిమాలో తన తండ్రి జెమినీ గణేశన్ పాత్రను చెడుగా చూపించారు అంటూ మండిపడ్డారు.

సినిమాలో తన తండ్రి జెమినీ గణేశన్ పాత్ర చిత్రీకరించిన తీరుపై ఆమె తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తంచేశారు. సినిమాలో తన తండ్రి జెమినీ గమేశన్ పాత్ర అతడికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా వుంది. అతడి స్వభావాన్ని తక్కువ చేసి చూపించారు. జెమినీ గణేశన్ అంటే ఒక బిజీ నటుడన్న విషయం అందరికీ తెలిసినప్పటికీ.. ఆయన అవకాశాలు లేక ఖాళీగా ఉన్నట్లు చూపించడం ఎంతమేరకు సబబు అని కమలా సెల్వరాజ్ ప్రశ్నించారు. 

అన్నింటికిమించి సావిత్రికన్నా ముందుగా తన తల్లిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు కన్న తన తండ్రికి మొట్టమొదటిసారిగా సావిత్రిపైనే ప్రేమ కలిగినట్టు సినిమాలో చూపించారు. అటువంటప్పుడు ఆయన తన తల్లిపై ప్రేమ లేకుండానే పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యారా అని ఆవేదన వ్యక్తంచేశారామె.

సావిత్రి సినిమా విషయంలో ఇప్పటివరకు ఎవ్వరితోనూ ఏ రకమైన విమర్శ విని ఎరుగని సావిత్రి సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ ఆమె ప్రశ్నలకు స్పందించి సమాధానం ఇస్తారా లేక లైట్ తీసుకుని ఊరుకుంటారా అనేది వేచిచూడాల్సిందే మరి.

Trending News