'ప్రధాని' పీఠంపై కన్నేసిన మాయావతి?

2019లో ప్రధాని పదవిని బీఎస్పీ అధినేత్రి మాయావతి టార్గెట్ చేశారని సమాచారం.

Last Updated : Jul 17, 2018, 11:56 AM IST
'ప్రధాని' పీఠంపై కన్నేసిన మాయావతి?

2019లో ప్రధాని పదవిని బీఎస్పీ అధినేత్రి మాయావతి టార్గెట్ చేశారని సమాచారం. దళిత ఓటు కార్డుతో ఈమె చక్రం తిప్పాలని భావిస్తుండగా.. 'తదుపరి ప్రధాని మాయావతి' అనే ప్రచారంతో బీఎస్పీ నేతలు పనిచేస్తున్నారట. విదేశీ మూలాలున్న సోనియా గాంధీకి రాహుల్ జన్మించడం వల్లన ఆయనకు దేశానికి ప్రధాని అయ్యే అవకాశం లేదని బహుజన్‌ సమాజ్‌ పార్టీ వ్యాఖ్యానించింది.

2019 లోక్‌సభ ఎన్నికలపై సమీక్షించేందుకు సోమవారం లక్నోలో పార్టీ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. రాహుల్‌కు తండ్రి పోలికల కంటే తల్లి పోలికలే ఎక్కువగా ఉన్నాయని.. అందుకే ప్రధాని కాలేరని పేర్కొంటూ.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని పదవికి విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాయావతికి ప్రకటించాలని బీఎస్పీ కోరింది. దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బీజేపీని ఏదుర్కొనే శక్తి కేవలం మాయావతికే ఉందన్నారు. బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలను ఒక్కతాటిపైకి తీసుకురావడం కోసం మాయావతి తీవ్రంగా కృషి చేస్తున్నారని పార్టీ సీనియర్‌ నేతలు వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం లోక్‌సభలో ఒక్క బీఎస్పీ ఎంపీ లేకున్నా.. ఉత్తరప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో ఓటు బ్యాంకు తమకుందంటున్న నేతలు వచ్చే ఎన్నికల్లో వీటిని సీట్లుగా మలుస్తామంటున్నారు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం బెహెన్ జీ పాచికలు పారవంటున్నారు.

కాగా.. 'బీఎస్పీ అధినేత్రి మాయావతి దేశానికి కాబోయే ప్రధాన మంత్రి' అని బీఎస్సీ జాతీయ సమన్వయకర్త జై ప్రకాశ్‌ సింగ్‌ వ్యాఖ్యానించడంపై మాయవతి స్పందించారు. పార్టీ సిద్దాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు తక్షణం పదవి నుంచి వైదొలగాలని ఆదేశించారు. ఉత్తరప్రదేశ్ లేదా మరే రాష్ట్రంలో గానీ, బీఎస్పీ ఇతర పార్టీలతో జతకట్టేవరకు ఏ స్థాయిలో ఉన్న పార్టీ నాయకులైనా సరే మాట్లాడకూడదని, పార్టీ హైకమాండ్‌కు వదిలేయాలని మాయావతి అన్నారు.    
 

Trending News