ఇక విద్యుత్ బిల్లు చెల్లిస్తేనే రేషన్ సరుకులు!

ఇక విద్యుత్ బిల్లు చెల్లిస్తేనే రేషన్ సరుకులు!

Last Updated : Sep 21, 2019, 11:58 PM IST
ఇక విద్యుత్ బిల్లు చెల్లిస్తేనే రేషన్ సరుకులు!

లక్నో: రేషన్ సరుకులకు, విద్యుత్ బకాయిలకు ముడిపెట్టి మొండి బకాయిదారులకు ఊహించని షాక్ ఇచ్చింది యూపీ సర్కార్. ఎప్పటికప్పుడు వినియోగదారుల నుంచి బాకీ పడుతూ వస్తోన్న విద్యుత్ బకాయిలను రాబట్టేందుకు యూపీ సర్కార్ ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ముఖ్య కార్యదర్శి అనూప్ చంద్రపాండే ఆదేశాల ప్రకారం.. సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించని వారికి సబ్సిడీ రేషన్ సహా ప్రభుత్వ పథకాలేవీ వర్తింపజేయొద్దంటూ జౌన్పూర్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కలెక్టర్ అర్వింద్ మల్లప బంగారి నుంచి జిల్లాలోని సంబంధిత అధికారులందరికీ ఆదేశాలు జారీ అయ్యాయి. అక్టోబర్ 1 నుంచి కరెంటు బిల్లు చెల్లించినట్టుగా రశీదు చూపిస్తేనే వారికి అందాల్సిన ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతాయి. లేదంటే ప్రభుత్వం ఒక్కరిని కూడా ఉపేక్షించబోదని కలెక్టర్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. 

రాష్ట్రంలో భారీ సంఖ్యలో వినియోగదారులు విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఉత్తర ప్రదేశ్ విద్యుత్ కార్పొరేషన్ భారీ నష్టాల్లో కూరుకుపోయిందని.. దీంతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తీవ్రమైందన్నారు. ఇటీవల యూపీ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఇదే అంశం ప్రస్తావనకు రాగా.. విద్యుత్ బకాయిల వసూలుకు వినూత్న నిర్ణయాలు తీసుకోకతప్పదని సీఎస్ ఆదేశించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇదివరకు లోక్ సభకు ప్రాతినిథ్యం వహించిన గోరక్‌పూర్ వంటి జిల్లాలోనూ విద్యుత్ బిల్లుల వసూలుకు ఈ తరహా పద్ధతినే పాటిస్తున్నట్టు సమాచారం.

Trending News